EventsFeaturedInspiration

విపత్తుపై అవగాహన సదస్సు

పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ వెంకటగిరిలో
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సౌజన్యంతో,
పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ , వెంకటగిరి ఆధ్వర్యంలో
విపత్తుపై అవగాహన సదస్సు

తిరుపతి జిల్లా వెంకటగిరిలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ నందు
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సౌజన్యంతో ఎపి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం విపత్తు నిర్వహణ, రక్షణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అవగాహన సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి వెంకటగిరిలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌కు చెందిన సుమారు 45 మంది సభ్యులు పాల్గొన్నారు. కమాండెంట్ శ్రీ కె.ఆర్.సి.హెచ్. మూర్తి గారు, అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ) శ్రీ బి. ఆనంద్ ఖన్నా గారు, ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. వెంకటేశ్వరరావు గారు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు విద్యార్థులకు మాక్ డ్రిల్స్, ప్రత్యక్ష డెమోన్స్ట్రేషన్స్ నిర్వహిస్తూ, ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలి, బాధితులకు ప్రాథమిక సహాయం ఎలా అందించాలి, రెస్క్యూ ఆపరేషన్స్‌ను ఎలా నిర్వహించాలి వంటి అంశాలను ఆచరణాత్మకంగా వివరించారు.
అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రదర్శనల ద్వారా వివరించడం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం సిద్ధాంతపరమైన అవగాహనకే పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా మాక్ డ్రిల్స్ మరియు డెమోన్స్ట్రేషన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు మరియు 20 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విధానం, రక్షణ చర్యల ప్రాధాన్యత మరియు విపత్తు సమయంలో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వంటి అనేక ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నారు.

విద్యార్థుల్లో విపత్తు నిర్వహణపై అవగాహన పెంపొందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తమకు, తమ కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి సహాయం చేయగలిగే విధంగా వారిని చైతన్యపరచడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా “అప్రమత్తత – అవగాహన – రక్షణ” అనే సందేశాన్ని విద్యార్థుల్లో బలంగా నాటగలిగామని పాఠశాల ప్రిన్సిపాల్ డా. డి. తులసి జ్యోతి వెల్లడించారు. విద్యార్థులకు విలువైన ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అధికారులకు, సిబ్బందికి పాఠశాల ప్రిన్సిపాల్ డా. డి. తులసి జ్యోతి మరియు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *